టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై తాజాగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘ఆది’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని చెప్పను.. అలా అని నాకు ఇంట్రెస్ట్ లేదని కూడా అనను” అంటూ తన పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్‌ను కొనసాగించారు. భవిష్యత్తులో పరిస్థితులు (డెస్టినీ) ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.
తన కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యాన్ని వినాయక్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తండ్రి గ్రామ స్థాయిలో సర్పంచ్‌గా సేవలందించారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన పరమ అనుయాయి అని తెలిపారు. ప్రస్తుతం తన తమ్ముడు వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారని, తమ కుటుంబం మొదటి నుంచి రాజకీయ వాసనలు ఉన్న కుటుంబమేనని ఆయన స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ ఇంటికి వచ్చి ఓదార్చారని, ఆ అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని వినాయక్ వివరించారు.
సినిమా రంగంలో అందరికీ మంచి చేయడమే తప్ప ఎవరికీ అపకారం చేయలేదని, రాజకీయాల్లోకి వచ్చినా అదే బాటలో నడుస్తానని వినాయక్ ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఆయన కుటుంబానికి మంచి పేరు ఉండటంతో వినాయక్ రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఆయన చేరే అవకాశం ఉందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వినాయక్ ఏ పార్టీ కండువా కప్పుకుంటారో చూడాలి.








