UPDATES  

NEWS

 మెడికల్ పీజీ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టుకు చేరిన వివాదం: తెలుగు రాష్ట్రాల్లో 600కు పైగా సీట్లు ఖాళీ.. విచారణకు స్వీకరించిన ధర్మాసనం!

తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలు తమ వద్ద ఖాళీగా ఉన్న పీజీ మెడికల్ సీట్ల భర్తీకి అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. కౌన్సిలింగ్ గడువు ముగిసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 600కు పైగా సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయని కాలేజీ యాజమాన్యాలు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చాయి. గడువు ముగియకముందే కౌన్సిలింగ్‌ను పొడిగించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కి విజ్ఞప్తి చేసినా, వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని పిటిషనర్లు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు జరిగిన వాదనల ప్రకారం.. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సిలింగ్ గడువు ముగిసే సమయానికి తెలంగాణలో 377 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 246 పీజీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఏపీలోని 45 కన్వీనర్ కోటా సీట్లు కూడా ఉన్నాయని న్యాయవాదులు వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో కౌన్సిలింగ్ గడువును పెంచినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందుకు నిరాకరించడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని వారు కోర్టుకు వివరించారు. అర్హులైన విద్యార్థులు చేరేందుకు సిద్ధంగా ఉన్నా సాంకేతిక కారణాలతో సీట్లు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్లను పరిశీలించిన జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. దీనిపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పిటిషన్ కాపీలను నేషనల్ మెడికల్ కమిషన్‌కు కూడా అందజేయాలని సూచించింది. ఈ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణను ఈనెల 23వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై వందలాది మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |