UPDATES  

NEWS

 నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ-ఈసీకి ఏం చెప్పబోతున్నారు..?

ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున హింస చెలరేగింది. ఎన్నికల పోలింగ్ రోజునే మొదలైన ఈ దాడుల పర్వం ఆ తర్వాత రెండు రోజులుగా కొనసాగుతోంది. దీన్ని నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పలు చోట్ల దాడులు మాత్రం కొనసాగాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేటలో చెలరేగిన హింసతో స్థానిక ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయాల్సి వచ్చింది. అలాగే రాయలసీమలోని అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్ధితి.

 

దీనిపై నిన్న కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎన్నికల తర్వాత ఇంత విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ సీఎస్, డీజీపీలను ప్రశ్నించింది. దాడుల్ని అడ్డుకోవడంలో వీరు విఫలమయ్యారనే అభిప్రాయానికి వచ్చింది. దీనిపై ఇవాళ ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని సమన్లు పంపింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇవాళ ఢిల్లీకి పయనం అయ్యారు. సీఈసీ రాజీవ్ కుమార్ ముందు హాజరై వీరిద్దరూ రాష్ట్రంలో హింసకు దారి తీసిన పరిస్ధితుల్ని వివరించనున్నారు.

రాష్ట్రంలో హింస చెలరేగడంపై ఆగ్రహంగా ఉన్న ఈసీ.. దీన్ని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారని అధికారుల్ని ఇప్పటికే ప్రశ్నించింది. దీంతో నిఘా వైఫల్యంపైనా ఈసీ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసను అరికట్టే విషయంలో నిఘా వైఫల్యమే కారణమని సీఎస్, డీజీపీ ఈసీకి వివరించే అవకాశం ఉంది. అలాగే పల్నాడు జిల్లా ఎస్పీని ఈ మధ్యే ఈసీ మార్చింది. అలాగే జిల్లా ఎస్పీలను ఈసీ మార్చిన చోటే హింస చెలరేగినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే వాదనను సీఎస్, డీజీపీ ఈసీకి వినిపించే అవకాశముంది.

 

పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో చెలరేగిన హింసకు సరైన కారణాలను వివరించడంలో సీఎస్, డీజీపీ విఫలమైతే వారిపై వేటు వేసేందుకు కూడా ఈసీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చి హరీష్ కుమార్ గుప్తాను నియమించిన ఈసీ.. ఇప్పుడు ఆయన్ను మార్చే అవకాశాలు లేకపోయినా మందలింపుతో సరిపెట్టవచ్చని తెలుస్తోంది. అలాగే ఈసీ ఆగ్రహంతో హింసాత్మక ఘటనలు చెలరేగిన జిల్లాలకు సీఈవో అదనపు బలగాలను పంపారు. అలాగే 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. ఇవాళ ఈసీ సమీక్ష తర్వాత చర్యలు ప్రకటించనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |