UPDATES  

NEWS

 తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన కేసీఆర్..

కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్అధినేత కేసీఆర్. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు.

 

పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడమేనని కేసీఆర్ మండిపడ్డారు. ఇది రైతులను మోసం చేయడం, దగా చేయడమేనని ధ్వజమెత్తారు.

 

రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు వంచించిందని మండిపడ్డారు.

 

డబ్బాలో ఓట్లు పడగానే కాంగ్రెస్ పార్టీకి రైతుల అవసరం తీరిందని కేసీఆర్ విమర్శించారు. అందుకే నాలిక మల్లేసి ఎప్పటిలాగే నయ వంచనకు పూనుకున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ అన్న మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే.. కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసే వారని కేసీఆర్ అన్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారని కేసీఆర్తెలిపారు. రైతుబంధు, రైతుభరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటోందని ధ్వజమెత్తారు. రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |