ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 24 గంటల తర్వాత తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అర్ధరాత్రి ప్రకటించింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను 17ఏ రిజిస్టర్ తో పోల్చి చూసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో ఇప్పటివరకూ గరిష్టంగా 81.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తేల్చింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లను కలిపి లెక్కిస్తే ఈ గణాంకాలు తేలాయి.
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో తుది పోలింగ్ శాతం 80.66 గా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.1 శాతం మేర నమోదు కావడంతో వీటిని కూడా కలుపుకుంటే మొత్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 81.76 శాతం మేర నమోదు అయినట్లు తేల్చారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87.09 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 68.63 శాతం నమోదైంది.
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ నమోదు అయినట్లు గుర్తించారు. తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదు అయింది. అత్యధికంగా ఒంగోలు పార్లమెంటుకు 87.06 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా విశాఖ పార్లమెంటుకు 71.11 శాతం పోలింగ్ నమోదైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో పోలింగ్ సరళి ఎలా ఉందనే దానిపై రాజకీయ పార్టీలకు ఓ అంచనా వచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్ జరగడంపై రాజకీయ పార్టీలు సంతోషంగా ఉన్నాయి. రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ శాతం తమకే మేలు చేస్తుందని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఈసీ తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా ఈసీ అంచనా వేసిన 81 శాతాన్ని మించి పోలింగ్ జరిగినట్లు తేలడంతో ఇది ఎవరిని తేల్చనుందో, ఇంకెవరిని ముంచనుందో అన్న ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీ కంటే విపక్షాలకే మేలన్న అంచనాలుంటాయి. అవి నిజం అవుతాయో లేదో తేలాలంటే జూన్ 4 వరకూ ఆగాల్సిందే.