ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కుండబద్దలు కొట్టేశారు టీడీపీ నేత, ఉండి అభ్యర్థి రఘురామకృష్ణరాజు. ఏకంగా 130 సీట్లలో విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. ఆపై వచ్చే సీట్లను బోనస్‌గా వర్ణించారు. ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్‌గా చెప్పుకొచ్చారు.
రాత్రి ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన, ఏపీలో ఈసారి ప్రజాస్వామ్యం వెల్లువిరిసిందన్నారు. ముఖ్యం గా ఉండి నియోజకవర్గంలో 86 శాతం పోలింగ్ నమోదు అయినట్టు మనసులోని మాట బయటపెట్టారు. మే 14న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు.. వైసీపీకి డెత్ డేగా మారుతుందని వర్ణించారాయన.
తను బర్త్ డే రోజు గతంలో వైసీపీ ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, చంపాలని ప్లాన్ చేసిందన్నారాయన. జైలులో తాను చేసిన శపథం నెరవేరబోతోందన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ కనిపించదని జోస్యం చెప్పారు. జగన్ పాలన చూసిన ఉద్యోగులు, ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారన్నారు. ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో కూటమిదే హవాగా చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సొంతూర్లకు వచ్చి ఓటు వేశారని, ఇంతకంటే చైతన్యం ఏం కావాలన్నారు.
కడప జిల్లాలో నాలుగైదు సీట్లను టీడీపీ గెలుచుకుంటుందన్నారు రఘురామకృష్ణరాజు. అందులో కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలున్నాయని వెల్లడించారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్ కంటే షర్మిలకే మెజార్టీ వస్తుందన్నారు. ఈసారి కడపలో టీడీపీ పాగా వేయడం ఖాయమన్నారు. అటు పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ 50 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించనున్నట్లు తెలిపారు.
పనిలో పనిగా పోలింగ్ తర్వాత వైసీపీ నేతలు చేసిన కామెంట్స్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఆ పార్టీ నేతలు నిజాలు మాట్లాడారని గుర్తుచేశారు. వాళ్లు కేవలం ఓ వర్గానికి చెందిన ప్రజలకు మాత్రమే న్యాయం చేశారని, మిగతా వర్గాలు రెట్టించిన ఉత్సాహంతో ఈసారి పోలింగ్‌లో పార్టిసిపేట్ చేశారన్నారు. ఎలాంటి విషయాన్ని అయినా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులుగా వర్ణించారు.
గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజలకు ఏమాత్రం ద్వేషం లేదన్నారు. కాకపోతే ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఫ్యాన్ పార్టీ నేతలు అడిగిన ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చే శారని, ఇక వాళ్ల పనైపోయిందన్నారు. వచ్చేదంతా చల్లగా ఉండే వాతావరణమని, ఇక ఫ్యాన్‌తో అవసరం లేదని తనదైనశైలిలో వ్యాఖ్యానించారు రఘురామకృష్ణరాజు.