UPDATES  

NEWS

 కవితపై కొత్తగా 200 పేజీల ఛార్జిషీట్.. గోవాతో లింక్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇబ్బందులు మరింత పెరిగాయి. ఒకవంక- బెయిల్ కోసం ఆమె ప్రయత్నాలు సాగిస్తోండగా.. మరోవంక కొత్త ఛార్జిషీట్ దాఖలైంది.

 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెపై కొత్తగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో కవిత పేరును చేర్చారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు- దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, ఛన్‌ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్ పేర్లను కూడా ఈ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో మొత్తం మీద ఇది ఏడో ఛార్జ్‌షీట్.

ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో తొలిసారిగా మార్చి 15వ తేదీన అరెస్టయ్యారు కవిత. అప్పట్లో ఆమెపై ఈడీ అధికారులు ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 60 రోజుల్లోపల నిందితులకు శిక్ష పడకపోతే మళ్లీ కొత్త ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నాటికి దీని కాల వ్యవధి ముగుస్తోన్నందున.. కొత్తగా ఛార్జ్‌షీట్ పెట్టారు.

 

ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను ఇందులో పొందుపరిచారు. 2022 నాటి గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కవిత ప్రచార వ్యవహారాలు, దానికి అయ్యే ఖర్చును హ్యాండిల్ చేశారని ఈడీ అధికారులు తాజాగా తమ ఛార్జిషీట్‌లో పొందుపరిచారు. ఆ మొత్తం అంతా కూడా అక్రమంగా ఆర్జించిన డబ్బేనని తేల్చారు.

 

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. 100 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆమ్ ఆద్మీ పార్ట నాయకులకు చెల్లించినట్లు ఆమెపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈడీ కేసులో ఈ నెల 14, సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు సాగిస్తోన్నప్పటికీ.. అవి విజయవంతం కావట్లేదు. బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం నిరాకరించింది.

 

ఈ క్రమంలో బెయిల్ కోసం కవిత.. తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్లను వేశారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాదులు మోహిత్ రావు, దీపక్ నగర్ ఈ పిటీషన్లను దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్.. విచారణ చేపట్టనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |