రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ ఆరంభమైంది.. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి.
ఈ నేపథ్యంలో- మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండనున్నారు. తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన పవన్ కల్యాణ్ తరఫున చిరంజీవి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారంటూ మొదట్లో వార్తలొచ్చినప్పటికీ అవి వాస్తవ రూపాన్ని దాల్చట్లేదు.
పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. కూటమి తరఫున ఆయన.. ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారని భావించారంతా. కాపు సామాజికవర్గ ఓటుబ్యాంకు అధికంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున చిరంజీవి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు సైతం వెల్లడించాయి.
అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింట్లోనూ సుడిగాలి ప్రచారంలో పాల్గొంటారని అంటోన్నారు. కాకినాడ, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు టీ టైమ్ ఉదయ్, పురంధేశ్వరి కోసం కూడా చిరంజీవి ప్రచారం చేస్తారని అప్పట్లో అంచనా వేశాయి.
వాటన్నింటిని తలకిందులు చేసినట్టే కనిపిస్తోంది మెగాస్టార్. ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నట్టే. తాజాగా ఆయన ఓ వీడియోను విడుదల చేయడం.. ఈ అనుమానాలను మరింత బలాన్ని ఇస్తోంది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను గెలిపించాలంటూ చిరంజీవి వీడియో విడుదల చేశారు. అమ్మ కడుపున ఆఖరువాడిగా పుట్టినా, అందరికీ మేలు జరగాలనే విషయంలో ముందువాడిగా ఉంటాడని పవన్ కల్యాణ్‌ను ప్రశంసించారు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం ఆయనకు ఉందని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని ఎవరైనా అనుకుంటారని, దీనికి భిన్నంగా పవన్ కల్యాణ్.. తన సొంత సంపాదన నుంచి కౌలు రైతుల కన్నీళ్లు తుడిచాడని గుర్తు చేశారు. ఆర్మీ సహాయనిధి, మత్స్యకారులు.. ఇలా చాలామందికి సహాయం చేశారని చెప్పుకొచ్చారాయన. అవన్నీ చూస్తోంటే ఇలాంటి నాయకుడే జనానికి అవసరం అని అనిపిస్తోందని చెప్పారు.
సినిమాల్లోకి పవన్ బలవంతంగా వచ్చాడని, రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడని చిరంజీవి వ్యాఖ్యానించారు. తమ్ముడు మాటలు పడుతోంటే తల్లికి, తనకు ఎంతో బాధగా ఉంటోందని, ఎంతోమంది తల్లులు, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తోన్నాడని, తాము పడుతున్న బాధ కంటే అదెంతో గొప్పదని అన్నారు.
అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే వాళ్ల వళ్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టం అని పవన్ నమ్మాడని, అందుకే జనం కోసం జనసైనికుడు అయ్యాడని చిరంజీవి వివరించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశాడని, రాష్ట్ర భవిష్యత్తు కోసం చట్టసభల్లో ఆయన గొంతు వినపడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పిఠాపురంవాసులకు న్యాయం చేయడానికి పవన్ ఎంతవరకైనా వెళ్తాడని, ఎవరితోనైనా కలబడుతాడని అన్నారు. అందుకే గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి, పవన్ కల్యాణ్‌ను గెలిపించాలంటూ మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు.









