పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమని, అక్కడ నివసిస్తున్న ముస్లింలు, హిందువులు ఇద్దరూ భారతీయులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పునరుద్ఘాటించారు.
“పిఓకే భారతదేశంలో అంతర్భాగమని బీజేపీ విశ్వసిస్తుంది. POKలో నివసిస్తున్న ముస్లింలు, హిందువులు కూడా భారతీయులే. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ఈ భూమి కూడా భారతదేశానికి చెందినదే. దానిని తిరిగి పొందడం ప్రతి కాశ్మీరీ, ప్రతి భారతీయుడి లక్ష్యం,” అని షా ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
ఆర్టికల్ 370 గురించి కాశ్మీర్ లోయ ప్రజలకు తప్పుడు వివరణ ఇచ్చారని షా తెలిపారు.
“ఒకసారి ఆర్టికల్ 370 రద్దు చేస్తే, కాశ్మీరీల సంస్కృతి, భాష, ఉనికికి ముప్పు వాటిల్లుతుందని ఎప్పుడూ చెప్పేవారు. రద్దు చేసి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పుడు అలాంటిదేమీ జరగలేదు. కాశ్మీరీలు నేడు స్వేచ్ఛగా ఉన్నారు. కాశ్మీరీ భాష ప్రాముఖ్యత, ఆహార సంస్కృతి పెరిగింది. పర్యాటకులు కాశ్మీర్‌కు తరలి వస్తున్నారు, ” అని హోం మంత్రి అమిత్ షా అన్నారు.
ఆర్టికల్ 370 చుట్టూ తిరిగే అనేక అపోహలపై షా మాట్లాడారు. “కాశ్మీరీల ఉనికికే ముప్పు వాటిల్లేలా లక్షలాది మంది ప్రజలు కాశ్మీర్‌కు తరలివెళ్తారని, కాశ్మీరీల ఉనికికి అది ప్రమాదం అని చాలా మంది అన్నారు. కానీ అది కరెక్ట్ కాదని నిరూపితమైనది” అని అమిత్ షా స్పష్టం చేశారు.
“ఆర్టికల్ 370 నీడలో, వేర్పాటువాద భావజాలం రూపుదిద్దుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని యువకులను ఉగ్రవాదంలోకి లాగారు. పాకిస్తాన్ ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసింది. గత 4 దశాబ్దాలలో, 40,000 మందికి పైగా యువకులు ప్రాణాలు కోల్పోయారు, ”అని షా పేర్కొన్నారు.
“కానీ నేడు జమ్మూ కాశ్మీర్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఉగ్రవాదం అంతం కాబోతోంది, రాళ్ల దాడి పూర్తిగా ఆగిపోయింది. అవినీతిని అరికట్టడానికి అవినీతి నిరోధక బ్యూరో ఏర్పాటు చేశాము. ప్రజల డబ్బు ప్రజలకు చేరుతోంది, ”అని కేంద్ర మంత్రి తెలిపారు.