కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కేసీఆర్, హరీశ్ రావును, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన బీజేపీని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘ఫెవికాల్ బంధం’ ఉందని విమర్శించిన ఆయన, ఈ ముగ్గురు నేతలను జైలుకు పంపిన తర్వాతే బీజేపీ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం రెండేళ్లలో రూ. 17,442 కోట్లు ఖర్చు చేసిందని, 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు రైతు రుణమాఫీని విజయవంతంగా అమలు చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోతామని తెలిసినా తెలంగాణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డల చీరల్లో కూడా కమీషన్లు తీసుకున్నారని ఆరోపించిన ఆయన, తమ ప్రభుత్వం వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేసిందని వెల్లడించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై కూడా ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీకి ఒక్క రోజు కూడా రాని కేసీఆర్ నెల నెలా వేతనం మాత్రం తీసుకుంటున్నారని, ఆయన జీతంలో కోత విధించవద్దా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతూ అసెంబ్లీ తీర్మానం పంపినా కేంద్రం స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మోదీ, అమిత్ షా ఎవరిని తీసుకొచ్చినా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.









