మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మొదటి విడతగా తెలంగాణకు రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుజూరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.259 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని, మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేస్తే నేరుగా ఢిల్లీ నుంచే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. కేంద్రం నిధులతో ఆసుపత్రులకు పరికరాలు ఇస్తుంటే, సిబ్బందిని నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే హుజూరాబాద్‌లో మినీ స్టేడియం నిర్మిస్తామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని ఆయన వాగ్దానం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లపై స్పందిస్తూ, అవి కేవలం ప్రకటనలకే పరిమితమని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద మాత్రమే తెలంగాణకు ఇళ్లు మంజూరవుతున్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని చెప్పిన రేవంత్ రెడ్డి, కనీసం వారిని ఫామ్ హౌస్ నుండి కూడా కదిలించలేకపోయారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాను, కిషన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.









