ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలులో ఇంకా లోపాలు, ఉదాసీనత కనిపిస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు, క్షేత్రస్థాయి ఫలితాలకు మధ్య ఉన్న గ్యాప్‌ను అధికారులు వెంటనే పూడ్చాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనకాడటం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా చేపట్టిన ‘పల్లె పండుగ’, ‘అడవి తల్లి బాట’ వంటి పథకాలతో గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 10 వేల కోట్ల పనులు, అటవీ శాఖ ద్వారా రూ. 200 కోట్లతో నగరవనాల ఏర్పాటు వంటి భారీ ప్రాజెక్టుల పురోగతిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఖజానా నుండి ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల ప్రయోజనం కోసమే వినియోగించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పాలన అనేది కేవలం గదులకే పరిమితం కాకూడదని, అది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. నిర్ణీత కాలపరిమితిలో పనులు పూర్తి కాకపోవడంపై వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని, అలసత్వాన్ని వీడి నిజాయతీగా పనిచేయాలని హెచ్చరించారు. పారదర్శకతే తమ ప్రభుత్వ విధానమని, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు అనుభవం, కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని పురోభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.








