UPDATES  

NEWS

 విజయారెడ్డి ఆత్మహత్య కేసు: యూట్యూబ్ ఛానెళ్లపై చిరంజీవి ఫిర్యాదు.. పరువు నష్టం దావాకు సిద్ధం!

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి మరియు ఆమె ఇద్దరు పిల్లల ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాదకర ఘటనపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయంటూ విజయారెడ్డి సోదరుడు చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన, సదరు ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమ కుటుంబం ఇప్పటికే తీవ్ర విషాదంలో ఉంటే, ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానసికంగా మరింత కుంగదీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు ఈ ఫిర్యాదును పరిశీలించి, ఇలాంటి డిజిటల్ మీడియా సంబంధిత అంశాలపై కోర్టును ఆశ్రయించాలని చిరంజీవికి సూచించారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానెళ్లపై ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. విజయారెడ్డి ఆఫీస్ పనిలో చాలా బిజీగా ఉండేవారని, టీమ్ లీడర్‌గా ఉన్న ఒత్తిడి కారణంగానే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లారని ఆయన వివరించారు. ఈ మరణాల వెనుక తమకు ఎలాంటి ఇతర అనుమానాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విజయశాంతి రెడ్డి తీవ్రమైన డిప్రెషన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. తన తర్వాత తన పిల్లలు (విశాల్ రెడ్డి, చేతనా రెడ్డి) ఒంటరి అయిపోతారనే ఆందోళనతో వారిని కూడా ఆత్మహత్యకు ఒప్పించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా, ఆమెను అంతటి తీవ్ర నిర్ణయానికి పురికొల్పిన పరిస్థితులపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |