తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భూపాలపల్లి, పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి వాడుతున్న భాషా తీరును తప్పుపట్టారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ వంటి ఎందరో ఉద్ధండులైన ముఖ్యమంత్రులను చూశామని, కానీ హామీల గురించి అడిగితే ‘లాగులో తొండలు విడిచిపెడతా’, ‘పేగులు మెడలో వేసుకుంటా’ అని మాట్లాడే వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నామని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను గానీ, పార్టీ కార్యకర్తలను గానీ తిడితే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. “నీ పదవీ కాలం మరో రెండేళ్లే.. ఆ తర్వాత మళ్లీ గులాబీ జెండా ఎగురుతుంది. అప్పుడు నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలిపెట్టం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పేరును ‘లాగుల తొండల్ రెడ్డి’గా అభివర్ణిస్తూ, అభివృద్ధిని పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కుంభకోణాలకే తెరలేపిందని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేసే ధైర్యం ఎవరికీ లేదని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు అస్తవ్యస్తంగా తయారైందని కేటీఆర్ మండిపడ్డారు. రూ. 4 వేల పెన్షన్, తులం బంగారం, రైతుబంధు పెంపు వంటి ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. సింగరేణిని సీఎం తన బావమరిదితో కలిసి దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని, అప్పుడే హామీలు అమలవుతాయని ఓటర్లకు పిలుపునిచ్చారు.








