UPDATES  

NEWS

 మెదక్ మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: ఫిబ్రవరి 13న ఫలితాలు.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు!

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం కలెక్టరేట్‌లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ నెల 13వ తేదీ (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీలకు గానూ 26 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ కోసం 31 మంది సూపర్వైజర్లు, 62 మంది అసిస్టెంట్లను నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ, రౌండ్ల వారీగా ఫలితాలను ఖచ్చితత్వంతో వెల్లడించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

లెక్కింపు ప్రక్రియను రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో ప్రాథమిక కౌంటింగ్, రెండో దశలో వివరణాత్మక లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ ఆ రోజు ఉదయం 6 గంటలకే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని, తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని సూచించారు. ఏదైనా సందేహం వస్తే వెంటనే రిటర్నింగ్ అధికారులను సంప్రదించాలని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సిబ్బందికి ఎదురయ్యే సాంకేతిక సమస్యలపై అవగాహన కల్పించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |