రాష్ట్రంలోని సాగునీటి వినియోగదారుల సంఘాల (WUA) బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇకపై సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ (GST) లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరు అందించడమే లక్ష్యమని, ఆ బాధ్యతను సాగునీటి సంఘాలే తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నామినేషన్ పద్ధతిలోనే పనులను ఈ సంఘాలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.
నీటి భద్రత అందరికీ అవసరమని, అయితే నీటి సంరక్షణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 40 జీవనదుల జలాలను సమర్థంగా వినియోగించుకుంటే కరువు అనే మాటే ఉండదని ఆయన పేర్కొన్నారు. పరుగెత్తే నీటిని నిలిపి, భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలు చేపట్టిన పనులకు సంబంధించి ఆగిపోయిన బిల్లులను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చి వారికి భరోసా కల్పించారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, వరితో పాటు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పంట కాల్వల నిర్వహణ కోసం నీటి పన్నులు వసూలు చేసి, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సంఘాలకు దిశానిర్దేశం చేశారు. ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ, రైతులకు అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









