UPDATES  

NEWS

 తిరుమల లడ్డూ కల్తీపై ఏకసభ్య విచారణ కమిషన్: దోషులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ఈ అపచారానికి కారకులైన అసలైన సూత్రధారులను పట్టుకోవడానికి ఒక ప్రత్యేక ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తప్పిదాలపై సిట్ (SIT) ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, మరింత లోతైన విచారణ కోసం ఈ కమిషన్ పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లోనే కల్తీ నెయ్యి వాడుతున్న విషయం బయటపడినా, అప్పటి ప్రభుత్వం ఆ నివేదికలను తొక్కిపెట్టి అపచారాన్ని కొనసాగించిందని ఆయన మండిపడ్డారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలపడం, ఆ కల్తీ ప్రసాదాన్ని అయోధ్య రామాలయానికి కూడా పంపడం వంటి చర్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తప్పును ఒప్పుకోకుండా క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని, ఈ మహాపాపానికి ఒడిగట్టిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలను కూడా ఈ ఏకసభ్య కమిషన్ ముందు ఉంచుతామని, త్వరితగతిన విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అలాగే తిరుమల సంప్రదాయాలను గౌరవించని వారు ఎంతటి వారైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని, డిక్లరేషన్ వంటి అంశాలపై కూడా కఠినంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |