ఫోన్ ట్యాపింగ్ కేసులో వస్తున్న ఆరోపణలను కేటీఆర్ పూర్తిగా కొట్టిపారేశారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపరమైన సమాచారం ఎలా అందుతుందో, గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అలాగే సమాచారం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకు లేదని, కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసీఆర్‌ను గంటల తరబడి విచారణ పేరుతో కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. మొదట వ్యాపారవేత్తలు, సినిమా తారల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రచారం చేసి, ఇప్పుడు నిలదీస్తే ఆధారాలు చూపలేకపోతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందని, శాంతిభద్రతలు క్షీణించాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లలో కూడా ప్రభుత్వం విఫలమైందని, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సిట్‌ల పేరుతో విచారణలు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంలో సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే అసలు నిజాలు బయటపడతాయని సవాల్ విసిరారు.
కేంద్ర బడ్జెట్ విషయంలోనూ కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. బయో ఫార్మా రంగానికి కేంద్రం రూ. 10 వేల కోట్లు కేటాయించినా, హైదరాబాద్‌కు మాత్రం ఒక్క రూపాయి కూడా దక్కలేదని విమర్శించారు. తెలంగాణ నుంచి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నుంచి ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీపై తాము పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.









