టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ నెల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుందని సమాచారం. గతేడాది అక్టోబరులోనే హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం అత్యంత రహస్యంగా, కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగిందని, ఇప్పుడు పెళ్లికి కూడా అదే పంథాను అనుసరిస్తూ కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే వేడుక నిర్వహించాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
పెళ్లి వేదికగా భావిస్తున్న ఉదయ్‌పూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో అలంకరణ పనులు జరుగుతున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి వివాహం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. గతంలో ఇటలీలో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ జరుపుకోవడం, ఇటీవల కలిసి హైదరాబాద్‌కు తిరిగి రావడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే, ఈ పెళ్లి వార్తలపై విజయ్ లేదా రష్మిక ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో ఈ విషయంపై స్పందించిన రష్మిక, సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా వెల్లడిస్తానని తెలివిగా బదులిచ్చారు. ప్రస్తుతం రష్మిక తన సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసుకుని విరామంలో ఉండటంతో, ఈ నెలలోనే వీరి పెళ్లి కబురు వచ్చే అవకాశం ఉందని అంతా ఆశిస్తున్నారు. ఏది ఏమైనా ఈ జంట నుంచి అధికారిక స్పష్టత వచ్చే వరకు అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.









