సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిర్మాణంలో తెరకెక్కిన తాజా ప్రేమకథా చిత్రం ‘విత్ లవ్’. ఈ సినిమాతో దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను శనివారం చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. గతంలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన అభిషన్, ఇప్పుడు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, ఇదొక స్వచ్ఛమైన మరియు ఆహ్లాదకరమైన రూరల్ లవ్ స్టోరీగా అనిపిస్తోంది. యువతను ఆకట్టుకునే భావోద్వేగాలు, పల్లెటూరి నేపథ్యంలోని అందమైన విజువల్స్, మరియు నేపథ్య సంగీతం సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. సీన్ రోల్డాన్ అందించిన సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రంలో కావ్య అనిల్, సచిన్ నాచిప్పన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే తమిళంలో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాను తెలుగులోనూ భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 6 వరకు వేచి చూడాల్సిందే.









