ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలు వీణ, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే శ్రీధర్ ఇద్దరూ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలతో కూడిన వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ, ప్రత్యక్షంగా మాత్రం వీరిద్దరూ ఎవరికీ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
లైంగిక ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, గత కొద్దిరోజులుగా తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఈ వ్యవహారంపై వారంలోగా వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆదేశించినప్పటికీ ఆయన స్పందించలేదు. ఇది తనపై జరిగిన ‘డీప్ ఫేక్’ కుట్ర అని శ్రీధర్ వాదిస్తుండగా, దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకోవడానికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితురాలిగా చెప్పుకుంటున్న వీణపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ వివాదం ఇప్పుడు ఏపీలో రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్యే శ్రీధర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. కేవలం ఆడియో, వీడియో క్లిప్పింగ్‌ల ద్వారానే ప్రచారం సాగుతుండటంతో, అసలు నిజానిజాలు తెలియాలంటే ఆ ఇద్దరూ పోలీసుల ముందుకు రావాల్సి ఉంది. ఈ వీడియోల నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ విచారణ కూడా అనివార్యంగా కనిపిస్తోంది.









