ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తనకున్న విడదీయరాని అనుబంధాన్ని మంత్రి నారా లోకేష్ మరోసారి గుర్తుచేసుకున్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించిన ఆయన, తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ అండగా నిలిచిన తీరును కొనియాడారు. 2023 సెప్టెంబర్‌లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రికి వచ్చి ధైర్యం చెప్పడం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని లోకేష్ ఎమోషనల్ అయ్యారు.
“అంతా బాగున్నప్పుడు అందరూ మన ఇంటికి వస్తారు, పలకరిస్తారు.. కానీ కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడేవారే నిజమైన మిత్రులు” అని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో తమ కుటుంబంపై పవన్ చూపిన ప్రభావం, ఇచ్చిన భరోసాను తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇచ్చిన డిన్నర్ లోనే తాను మొదటిసారి పవన్‌ను కలిశానని, అప్పటి నుంచి తమ మధ్య అన్నదమ్ముల వంటి అనుబంధం కొనసాగుతోందని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా లోకేష్ తన కాలేజీ రోజులను కూడా గుర్తుచేసుకున్నారు. అమెరికాలో చదువుతున్న సమయంలో అటెండెన్స్‌కు మార్కులు ఉండటం వల్ల తాను ఎప్పుడూ కాలేజీ బంక్ కొట్టలేదని సరదాగా చెప్పారు. తనకు 90 శాతం అటెండెన్స్ ఉంటే, తన భార్య బ్రాహ్మణికి మాత్రం వంద శాతం అటెండెన్స్ ఉండేదని తెలిపారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ ఎంతో హుందాతనంతో, ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.









