మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఎన్సీపీ అధినేత, దివంగత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ శనివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ఆకస్మిక మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేస్తూ, ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా 62 ఏళ్ల సునేత్రా పవార్ రికార్డు సృష్టించారు.
అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీపై పట్టు కోల్పోకుండా ఉండాలని, ఆయన రాజకీయ వారసురాలిగా సునేత్రా పవార్‌ను బరిలోకి దించాలని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నిర్ణయించింది. సీనియర్ నేత ఛగన్ భుజబల్ ప్రతిపాదించిన ఆమె పేరుకు ఎమ్మెల్యేలందరూ మద్దతు పలికారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిఫార్సు మేరకు ఆమెకు ఈ బాధ్యతలు దక్కాయి. ఇదే సమయంలో వారి కుమారుడు పార్థ్ పవార్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ భావిస్తోంది. సునేత్రా పవార్ నియామకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు, విడిపోయిన ఎన్సీపీ వర్గాల విలీనంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అజిత్ పవార్ మరణానికి ముందే శరద్ పవార్ వర్గంతో విలీనం గురించి చర్చలు జరిగాయని సమాచారం. అయితే, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియా సూలేపై పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్రా పవార్.. ఇప్పుడు నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు.









