UPDATES  

NEWS

 జనసేన కాదు.. కామసేన.. ఎమ్మెల్యే శ్రీధర్ వీడియోపై భగ్గుమన్న ఆర్కే రోజా..!

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన రాసలీలల వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది జనసేన కాదని, మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ‘కామసేన’ అని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆమె సొంత నియోజకవర్గమైన నగరిలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు.

 

ఈ ఆందోళనలో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులతో కలిసి రోజా ఏజేఎస్‌ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార మదంతో ఒక మహిళా ఉద్యోగిని బెదిరించి, ఆమె జీవితాన్ని నాశనం చేసిన కీచక ఎమ్మెల్యేను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

పవన్, చంద్రబాబు, హోంమంత్రిపై తీవ్ర విమర్శలు

 

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఆడవాళ్లకు అన్యాయం చేస్తే రోమాలు పీకేస్తా, చర్మం ఒలుస్తా అని ఊగిపోయే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నారు?” అని సూటిగా ప్రశ్నించారు. “గతంలో జానీ మాస్టర్, కిరణ్ రాయల్, వినూత్న వంటి వారు తప్పు చేసినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే, ఈరోజు మీ ఎమ్మెల్యే శ్రీధర్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడేవాడా?” అని నిలదీశారు. వీడియోలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, త్రీ-మెన్ కమిటీ వేసి కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు, స్పెషల్ ఫ్లైట్ల కోసమే పవన్ రాష్ట్రానికి వస్తారని, ప్రజల కష్టాలను పట్టించుకోరని ఆరోపించారు.

 

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనితపైనా రోజా విమర్శల వర్షం కురిపించారు. మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, తన సొంత జిల్లా విశాఖలో డ్రగ్స్, గంజాయిని అరికట్టలేని మంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ఎద్దేవా చేశారు. గతంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ అయినా, ఇప్పుడు సొంత పార్టీ, మిత్రపక్ష ఎమ్మెల్యేల అరాచకాలైనా మహిళలను కాపాడటంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, ఆయనో ‘చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, హోంమంత్రి అనిత తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళల ఆత్మగౌరవానికి రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. వైసీపీ ఆందోళనతో నగరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |