UPDATES  

NEWS

 అమిత్ షా-పవన్ భేటీ.. ఉప్పాడ రక్షణ గోడపై చర్చ..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు, ప్రత్యేకించి ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సమావేశం జరిగింది.

 

ఉప్పాడ ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారంగా ‘సీ ప్రొటెక్షన్ వాల్’ (సముద్ర రక్షణ గోడ) నిర్మాణ ప్రతిపాదనపై పవన్ చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని ఆయన అమిత్ షాకు వివరించారు. కాకినాడ జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఈ ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి సమర్పించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం పట్ల పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రూ. 320-323 కోట్ల అంచనా వ్యయంతో ఈ రక్షణ గోడను నిర్మించనున్నారు.

 

పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనే ఉప్పాడ ఉంది. అక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సముద్రపు కోత సమస్యకు కేంద్రం సహకారంతో శాశ్వత పరిష్కారం కనుగొంటానని ఆయన గతంలో హామీ ఇచ్చారు. ఆ దిశగా ఈ భేటీ ముందడుగుగా కనిపిస్తోంది. సమావేశం ఫలప్రదంగా జరిగిందని పవన్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

 

ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షాతో భేటీ అయ్యారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులపై చర్చించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |