ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం, శివరాత్రి ఉత్సవాల కంటే ముందే రహదారిని పూర్తి చేస్తానని గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య నిర్మించిన నూతన రహదారిని గురువారం (జనవరి 22, 2026) నాడు ఆయన ప్రారంభించారు. సుమారు రూ. 3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును అత్యంత వేగంగా నిర్మించడం విశేషం.
ఈ రహదారి నిర్మాణం వల్ల ఫిబ్రవరి 15న రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే సుమారు లక్షన్నర మంది భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు చేసిన విజ్ఞప్తికి స్పందించిన పవన్ కళ్యాణ్, భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయించారు. కేవలం భక్తులకే కాకుండా, ఈ రోడ్డు వల్ల స్థానిక రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, అలాగే గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరగనుంది.
రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ కోటప్పకొండలో చేపట్టనున్న మరిన్ని అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. కొండ దిగువన గిరిప్రదక్షణ మార్గం నమూనా లేఅవుట్‌ను, అలాగే అక్కడి జింకల పార్కును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పవన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ, తమ స్కూల్ మైదాన అభివృద్ధికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద్ బాబు మరియు ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు.









