పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మారుతీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో మారుతీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తన తదుపరి సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్న మారుతీ, మళ్లీ తన బలమైన ‘కామెడీ ఎంటర్‌టైనర్’ జోనర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం మెగా హీరో వరుణ్ తేజ్‌ను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవలే వరుణ్ తేజ్‌ను కలిసిన మారుతీ, ఆయనకు ఒక హిలేరియస్ కామెడీ కథను వినిపించారట. మారుతీ గతంలో తీసిన ‘భలే భలే మొగాడివోయ్’ తరహాలో ఈ కథాంశం పక్కా వినోదాత్మకంగా ఉండటంతో వరుణ్ తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ వంటి మాస్ హీరోతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న మారుతీ, ఈసారి వరుణ్‌తో తన మార్క్ కామెడీని పండించి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మారుతీకి ఆస్థాన నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.
వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ సినిమా పనులన్నీ పూర్తయిన వెంటనే మారుతీ – వరుణ్ తేజ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. రాజాసాబ్‌తో పోగొట్టుకున్న ఇమేజ్‌ను ఈ మెగా హీరో సినిమాతో మారుతీ తిరిగి సంపాదిస్తారో లేదో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.









