తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసును కేవలం ‘బక్వాస్’ (అర్థరహితం) అని కొట్టిపారేసిన ఆయన, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వానికైనా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు చేసే సాధారణ నిఘా ప్రక్రియ అని, ఇందులో మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ ఎటువంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేస్తూ.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని విమర్శించారు. “మా ఫోన్లు ఇప్పుడు ట్యాప్ కావడం లేదని రేవంత్ రెడ్డి కానీ, ఇక్కడి అధికారులు కానీ ప్రమాణం చేసి చెప్పగలరా?” అని ఆయన సవాల్ విసిరారు. సిట్ అధికారుల విచారణ తీరు ‘కార్తీక దీపం’ సీరియల్ లాగా సాగుతోందని ఎద్దేవా చేసిన కేటీఆర్, ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ డ్రామాను నడిపిస్తున్నారని ఆరోపించారు.
హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు తనకు నోటీసులు పంపడం వెనుక రాజకీయ కక్ష ఉందన్న కేటీఆర్, తాము ఎటువంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. బొగ్గు కుంభకోణం, భూ స్కామ్‌ల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఇటువంటి పాత కేసులను తవ్వుతోందని ఆయన విమర్శించారు. “నేను బరాబర్ సిట్ ఆఫీసుకి వెళ్తాను.. అక్కడ నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందో లేదో వారినే అడిగి వస్తాను” అని కేటీఆర్ స్పష్టం చేశారు. రేపు (జనవరి 23, 2026) ఉదయం 11 గంటలకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు.









