మావోయిస్టు ఉద్యమానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్, మోస్ట్ వాంటెడ్ నేత బర్సే సుక్కా అలియాస్ దేవా శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి సహా మొత్తం 20 మంది సభ్యులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరారు. ఈ భారీ లొంగుబాటుతో పీఎల్‌జీఏ విభాగం వెన్నెముక విరిగినట్లయిందని, అడవుల్లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని పోలీసులు విశ్లేషిస్తున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు తమ వెంట భారీగా అత్యాధునిక ఆయుధాలను తీసుకువచ్చి పోలీసులకు అప్పగించడం గమనార్హం. ఇందులో ఇజ్రాయెల్ తయారీ టవర్ వెపన్, అమెరికాకు చెందిన కోల్ట్ ఆయుధాలతో పాటు 8 ఏకే-47 తుపాకులు, ఎల్‌ఎమ్‌జీలు, స్నైపర్ రైఫిళ్లు మరియు హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్న ఆయుధ సామగ్రి ఉన్నాయి. వీటితో పాటు పార్టీకి చెందిన రూ. 20 లక్షల నగదును కూడా పోలీసులకు అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన దేవాపై ఎన్‌ఐఏ గతంలో రూ. 75 లక్షల రివార్డును ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో ప్రభావితమై వీరంతా లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వం తరపున మొత్తం రూ. 1.80 కోట్ల రివార్డు సొమ్మును అందజేయనున్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ. లక్ష నగదును డీజీపీ పంపిణీ చేశారు. అడవిలో అనాలోచిత పోరాటం వీడి మిగిలిన సభ్యులు కూడా లొంగిపోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.









