దర్శకత్వం నుంచి నటన వైపు మళ్లిన వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే, వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి మాత్రం అటువైపు వెళ్లే ఉద్దేశం లేదని ఖరాఖండిగా చెప్పారు. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆయనకు.. “మీరు హీరోగా ఎప్పుడు నటిస్తారు?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ, మనం ఒక రంగంలో టాప్‌లో ఉన్నప్పుడు దారి మళ్లించే ప్రలోభాలు (Traps) వస్తుంటాయని, పొరపాటున వాటికి లొంగితే ఉన్న కెరీర్ కూడా దెబ్బతింటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు ప్రస్తుతం హీరోగా చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదని, హ్యాపీగా తనకు వచ్చిన దర్శకత్వ పనిని చేసుకుంటూ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. రాజమౌళి తర్వాత టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా తనకు ఉన్న గుర్తింపును కాపాడుకోవడమే తన ప్రధమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేవలం నటన కోసం తన ఫోకస్‌ను డైవర్ట్ చేసి, ఇప్పటి వరకు సంపాదించుకున్న సక్సెస్ రేషియోను పాడుచేసుకోవడం ఇష్టం లేదని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి పూర్తి దృష్టి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపైనే ఉంది. ఈ సినిమా జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 4న తిరుపతిలో ఈ మూవీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. సంక్రాంతి సీజన్‌లో అనిల్ రావిపూడికి ఉన్న తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఈ సినిమాతోనూ కొనసాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.









