ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తీవ్రంగా ఖండించారు. శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా ఉనికి కోల్పోయిన జగన్ బృందం, సీఎంపై దుష్ప్రచారం చేస్తూ శునకానందం పొందుతోందని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై మాట్లాడే దమ్ము లేక, ఇలాంటి పిచ్చి ప్రచారాలకు వైసీపీ తెరలేపుతోందని ఆయన ధ్వజమెత్తారు.
చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులోనూ రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని, నూతన సంవత్సరం సందర్భంగా నాలుగు రోజులు కుటుంబంతో గడిపేందుకు విదేశాలకు వెళితే విమర్శించడం వైసీపీ ఫ్రస్ట్రేషన్‌కు నిదర్శనమని మాణిక్యాలరావు అన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ సీఎం నిరంతరం రాష్ట్ర పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. జగన్ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని గుర్తుచేశారు.
ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, ఒకటో తేదీనే ఇంటింటికీ పెన్షన్లు అందించడం వంటి హామీలను అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. పెన్షన్ల కోసమే ఇప్పటికే రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశామని, 22-ఏ భూముల సమస్యను పరిష్కరించి రైతులకు భరోసా కల్పించామని పేర్కొన్నారు. “సీఎం కనిపించడం లేదు” అని మాట్లాడుతున్న వారికి సమాధానంగా.. రేపే చంద్రబాబు ఆఫీసుకు వస్తారని, లోకేశ్ కూడా తన కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.









