పవన్ కల్యాణ్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్ లేదా వ్యక్తిగత అంశాలను వాణిజ్యపరంగా లేదా దురుద్దేశపూర్వకంగా ఉపయోగించకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), గూగుల్ (యూట్యూబ్), ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమ సంస్థలను జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ధర్మాసనం ఆదేశించింది. అభిమానుల ముసుగులో హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న వాదనను కోర్టు తీవ్రంగా పరిగణించింది.
సెలబ్రిటీల ఫోటోలను అక్రమంగా వాడుతూ మార్కెట్‌లో నకిలీ వస్తువులను విక్రయించడం, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ద్వారా వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఏ వ్యక్తికైనా తమ వ్యక్తిగత హక్కులను (Personality Rights) కాపాడుకునే అధికారం ఉంటుందని పేర్కొంది. కేవలం అభిమానుల ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తున్నారనే సాకుతో బాధ్యత నుండి తప్పుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి వారు కూడా తమ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల ఇమేజ్‌ను దుర్వినియోగం చేస్తూ ఆర్ధికంగా లాభపడాలని చూసేవారికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలవనుంది. పవన్ కల్యాణ్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి కావడంతో ఆయన హక్కుల విషయంలో కోర్టు ఇచ్చిన ఈ ‘ఇంజంక్షన్ ఆర్డర్’ ప్రాధాన్యత సంతరించుకుంది.









