ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న భూములకు సంబంధించి గత ప్రభుత్వం జారీ చేసిన ‘జగన్ బొమ్మ’ ఉన్న పాసుపుస్తకాల స్థానంలో, ఇప్పుడు అధికారిక రాజముద్ర (State Emblem) తో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జనవరి 2 నుంచి జనవరి 9 వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు, ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ వంటి నేతలు ఇప్పటికే ఈ పంపిణీని ప్రారంభించారు.
గత ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం పాసుపుస్తకాలపై ఫోటోలు ముద్రించి దాదాపు రూ. 22 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసిందని ముఖ్యమంత్రి విమర్శించారు. వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఇప్పటికే రద్దు చేసిన ప్రభుత్వం, రీ-సర్వేలోని లోపాలను సరిదిద్ది రైతులకు ఎటువంటి వివాదాలు లేని ‘క్లీన్ టైటిల్స్’ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో సుమారు 22 లక్షల కొత్త పాసుపుస్తకాలను సిద్ధం చేసి రైతులకు అందజేస్తున్నారు.
రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ పక్రియ వేగవంతంగా సాగుతోంది. పాసుపుస్తకం అనేది రైతు ఆత్మగౌరవానికి చిహ్నమని, దానిపై పాలకుల ఫోటోలు కాకుండా అధికారిక రాజముద్ర ఉండటమే సరైన గౌరవమని ప్రభుత్వం పేర్కొంది. భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్లకు నిర్దిష్ట గడువును కూడా విధించారు. రాబోయే వారం రోజుల్లో లక్షలాది మంది రైతులు తమ పాత పాసుపుస్తకాల స్థానంలో ఈ నూతన పత్రాలను అందుకోనున్నారు.









