ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో గుండెలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. రేబిస్ వ్యాధి సోకి 12 ఏళ్ల బాలుడు మరణించాడు. తను రోజువారీగా ఆడుకునే వీధి కుక్కే ఆ బాలుడి పాలిట మృత్యువైంది. కొద్దిరోజుల క్రితం కుక్క కరిచినప్పుడు ఆ విషయాన్ని బాలుడు కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం లేదా సకాలంలో వ్యాక్సిన్ తీసుకోకపోవడమే ఈ ప్రాణాపాయానికి కారణమని తెలుస్తోంది.
కుక్క కాటుకు సంబంధించి రేబిస్ లక్షణాలు బయటపడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వైరస్ శరీరమంతా వ్యాపించడంతో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ బాలుడు తుదిశ్వాస విడిచాడు. అప్పటివరకు తమ కళ్లముందే ఆడుకున్న బాలుడు, తను ఎంతో ఇష్టంగా ఆడుకునే కుక్క కాటుకే బలవ్వడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఈ ఘటనతో దుప్పుతూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమే కాకుండా, వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కుక్క కాటుకు గురైన వెంటనే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా రేబిస్ నిరోధక టీకాలు (Anti-Rabies Vaccine) తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కుక్కలు కరిచినప్పుడు వెంటనే తెలియజేయాలని వారికి అవగాహన కల్పించాలని అధికారులు కోరుతున్నారు.









