నటుడు శివాజీ తన ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెను దుమారం రేపుతున్నాయి. హీరోయిన్లు ఒళ్లు కనపడేలా బట్టలు వేసుకుంటే జనం మనసులో తిట్టుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంలోకి ప్రవేశించిన ఆర్జీవీ, శివాజీపై నిప్పులు చెరుగుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
మంచు లక్ష్మి చేసిన ఒక ట్వీట్‌ను ఉద్దేశించి వర్మ స్పందిస్తూ.. శివాజీని ‘సంస్కారహీనుడు’, ‘మురికివాడు’ అని సంబోధించారు. “శివాజీ.. నువ్వెవడివైనా సరే, ఇలాంటి నీతులు నీ ఇంట్లోని మహిళలకు చెప్పుకో. సమాజంలోని ఇతర మహిళల గురించి లేదా సినిమా ఇండస్ట్రీలోని వారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీ వ్యక్తిగత అభిప్రాయాలను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకో” అంటూ అత్యంత కఠినమైన పదజాలంతో ఆర్జీవీ చురకలు అంటించారు.
శివాజీ వ్యాఖ్యలపై ఇప్పటికే చిన్మయి, అనసూయ, మంచు మనోజ్ వంటి ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్జీవీ కూడా రంగంలోకి దిగడంతో ఈ వివాదం మరో స్థాయికి చేరుకుంది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో మగవారు ఇలాంటి నీతులు చెప్పడం సరికాదని మెజారిటీ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీ ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









