తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న కేసీఆర్, బయట మీడియా సమావేశాల్లో మాత్రం ప్రజా ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చర్చకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని, అక్కడ సమాధానం చెప్పలేక భయపడుతూ ప్రెస్ మీట్లకు పరిమితమయ్యారని విమర్శించారు.
ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను భట్టి విక్రమార్క కొట్టిపారేశారు. రాష్ట్ర ఖజానాలోని ప్రతి పైసాను ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో జరిగినట్లుగా నిధుల దుర్వినియోగం ఇక్కడ జరగడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం ఏటా రూ. 12,500 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లిస్తోందని గుర్తుచేశారు. అభివృద్ధి పనుల విషయంలో తాము చిత్తశుద్ధితో ఉంటే, ప్రతిపక్ష నేతలు మాత్రం తోలు తీస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసభ్యకరమైన భాష వాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని భట్టి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి, అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. పినపాక సబ్ స్టేషన్ నిర్మాణం ద్వారా ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని, భవిష్యత్తులో ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.









