నకిలీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా భారీ లాభాలు ఆశచూపుతూ సైబర్ నేరగాళ్లు సామాన్యులను నిలువునా ముంచుతున్నారు. ఈ మోసాల పట్ల హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. క్రిప్టో కరెన్సీ, స్టాక్ ట్రేడింగ్ మరియు ఫారెక్స్ ట్రేడింగ్‌లో ‘గ్యారెంటీ లాభాలు’ వస్తాయని చెప్పే సందేశాలను నమ్మవద్దని పోలీసులు కోరుతున్నారు. మోసగాళ్లు మొదట తక్కువ పెట్టుబడితో నకిలీ లాభాలను చూపిస్తూ, బాధితుల నమ్మకాన్ని గెలుచుకుని ఆ తర్వాత కోట్లలో పెట్టుబడి పెట్టించి మాయం చేస్తున్నారని అధికారులు వివరించారు.
ఈ మోసాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి ఇటీవల జరిగిన ఒక విషాదకర సంఘటనే నిదర్శనం. పంజాబ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమర్ సింగ్ చాహల్, వాట్సాప్ ద్వారా పరిచయమైన పెట్టుబడి స్కామ్‌లో చిక్కుకుని ఏకంగా రూ. 8.10 కోట్లు నష్టపోయారు. తన పొదుపు మొత్తంతో పాటు స్నేహితులు, బంధువుల దగ్గర అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన ఆయన, ఆ తర్వాత ఆర్థిక మరియు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన సైబర్ మోసాల వెనుక ఉన్న దారుణమైన వాస్తవాలను కళ్లకు కడుతోంది.
సైబర్ మోసగాళ్లు బాధితుడు డబ్బు విత్ డ్రా చేయాలని కోరగానే.. ట్యాక్స్, కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలంటూ మరిన్ని నిధులు లాగుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవాలంటే సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి సలహాలను నమ్మకూడదని, ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అది సెబీ (SEBI) వద్ద రిజిస్టర్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఒకవేళ మీరు లేదా మీ చుట్టుపక్కల వారు ఇలాంటి మోసాలకు గురైతే, వెంటనే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.









