తిరుమల పరకామణిలో జరిగిన దొంగతనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థించడంపై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి సొమ్ము దొంగతనాన్ని సమర్థించినందుకు జగన్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతికి ఆది పురుషుడు జగన్ అని, రాజకీయ అవినీతిపై పీహెచ్‌డీ చేస్తే ఆయనకే మొదటి ర్యాంక్ వస్తుందని ఎద్దేవా చేశారు.
వైసీపీ హయాంలో హిందూ మతంపై నిరంతరం దాడులు జరిగాయని బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో సుమారు రూ.2 కోట్ల విలువైన తలనీలాలను మయన్మార్, థాయ్‌లాండ్ మీదుగా చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పట్టుకున్న ఉదంతాన్ని ఆయన గుర్తుచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా హిందూ ధర్మాన్ని దెబ్బతీయడమే వారి ఏకైక ఎజెండా అని విమర్శించారు.
పన్నెండేళ్లుగా బెయిల్‌పై ఉన్న వ్యక్తికి దేవుడి సొమ్ము దొంగతనం అనేది చాలా చిన్న తప్పుగా కనిపిస్తోందని బుచ్చి రాంప్రసాద్ దుయ్యబట్టారు. దొంగతనం కేసులను లోక్ అదాలత్‌లో సెటిల్‌మెంట్ చేసుకోవాలనే కొత్త సిద్ధాంతాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని ఆయన మండిపడ్డారు. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి సొమ్మును దోచుకున్న వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని, త్వరలోనే ఈ కేసులోని అసలు దొంగల చరిత్ర వెలుగులోకి వస్తుందని ఆయన హెచ్చరించారు.









