రాష్ట్రంలో మద్యం విధానాన్ని కేవలం ఆదాయ వనరుగా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా కాకుండా, మద్యాన్ని ఒక ఉత్పత్తిగా పరిగణించి సంస్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపుల కట్టడిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం హర్యానా రాష్ట్రంలో అమలులో ఉన్న ‘సబ్ లీజు’ విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
మద్యం బాటిళ్లపై అవకతవకలకు తావులేకుండా ప్రతి బాటిల్‌పై ప్రత్యేక గుర్తింపు సంఖ్య (లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ – LIN) ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెంబర్ ద్వారా బ్రాండ్, తయారైన తేదీ మరియు సమయంతో సహా అన్ని వివరాలను సామాన్య ప్రజలు కూడా సులభంగా గుర్తించేలా ఉండాలన్నారు. అలాగే, పర్యావరణ పరిరక్షణ కోసం మద్యం సీసాలను తిరిగి ఇస్తే నగదు ఇచ్చే ‘డిపాజిట్ రిటర్న్ స్కీమ్’ (DRS) అమలు చేసే దిశగా ఆలోచించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 17 వరకు 4.52 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా బీర్ విక్రయాలు 94.93 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు 34.9 శాతం పెరగడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ, నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.









