ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే జనరల్ టికెట్ల విషయంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భారత రైల్వేశాఖ స్పష్టతనిచ్చింది. UTS యాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నా, ప్రయాణ సమయంలో కచ్చితంగా దాని ప్రింట్ అవుట్ వెంట ఉండాలని, లేదంటే ఆ టికెట్ చెల్లదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవగా, రైల్వే శాఖ అటువంటి నిబంధన ఏదీ తీసుకురాలేదని తేల్చి చెప్పింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, UTS యాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ మొబైల్‌లో టికెట్ చూపిస్తే సరిపోతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, రైల్వే స్టేషన్ కౌంటర్ల వద్ద నేరుగా కొనుగోలు చేసిన ఫిజికల్ టికెట్లను మాత్రం ప్రయాణికులు తప్పనిసరిగా తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టికెట్లపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, డిజిటల్ టికెట్లు యథావిధిగా చెల్లుతాయని రైల్వే శాఖ ప్రయాణికులకు భరోసా ఇచ్చింది.
మరోవైపు, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు భారీ వెసులుబాటు కల్పించింది. పండుగ సీజన్ కోసం సుమారు 600 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లుSCR అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 100 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రాగా, మిగిలిన రైళ్ల సమయ పట్టికను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుండి తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తోంది.









