అలనాటి ప్రముఖ కథానాయిక ఆమని రాజకీయ అరంగేట్రం చేశారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమనికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా అందజేశారు. కొన్నాళ్లుగా సినీ రంగానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ, తాజాగా ఆమని చేరికతో తెలంగాణలో సినీ గ్లామర్‌ను మరింత పెంచినట్లయింది.
పార్టీలో చేరిన అనంతరం ఆమని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. “భారతీయురాలిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. ప్రధాని మోదీ అడుగుజాడల్లో నడుస్తూ, సనాతన ధర్మం కోసం పాటుపడుతూ ప్రజా సేవకు నా వంతు కృషి చేస్తాను” అని ఆమె పేర్కొన్నారు. గత కొంతకాలంగా సామాజిక అంశాలపై స్పందిస్తున్న ఆమని, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న తరుణంలో ఆమని చేరికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో విజయశాంతి, జయసుధ వంటి సినీ తారలను చేర్చుకున్న బీజేపీ, ఇప్పుడు మళ్ళీ అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆమని బాటలోనే మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 1990లలో అగ్ర కథానాయికగా వెలిగిన ఆమని, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.









