హైదరాబాద్ నగరంలో ఇల్లు లేదా స్థలాలు అమ్మేవారిని లక్ష్యంగా చేసుకుని కొంతమంది మధ్యవర్తులు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే వారిని వీరు టార్గెట్ చేస్తున్నారు. కొనుగోలుదారుల ముసుగులో వచ్చే ఈ బ్రోకర్లు, ఆస్తి విలువలో కొంత భాగం (సుమారు 20-25 శాతం) అడ్వాన్స్ లేదా బయానాగా ఇచ్చి అమ్మకపు ఒప్పందం (Sale Agreement) చేసుకుంటారు. ఆ తర్వాత మిగిలిన సొమ్ము చెల్లించడానికి నెలల తరబడి రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేస్తారు.
యజమానులు విసిగిపోయి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చూస్తే, ఈ మోసగాళ్లు తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని కొంతమంది సిబ్బందితో చేతులు కలిపి, ఆ ఆస్తిపై ఉన్న అగ్రిమెంట్ రద్దు కాకుండా అడ్డుకుంటారు. “మేము లోకల్, మాకు పలుకుబడి ఉంది.. మీరు ఈ ఆస్తిని ఇంకెవరికీ అమ్మనివ్వం” అంటూ బెదిరింపులకు దిగుతారు. దీనివల్ల యజమానులు అటు డబ్బు రాక, ఇటు ఆస్తిని వేరే ఎవరికీ అమ్ముకోలేక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. చివరకు కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగలేక బ్రోకర్లు అడిగిన తక్కువ ధరకే ఆస్తిని అప్పగిస్తున్నారు.
ఈ రకమైన మోసాల నుండి తప్పించుకోవడానికి నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. అమ్మకపు ఒప్పందంలో తప్పనిసరిగా కాలపరిమితిని (ఉదాహరణకు 60-90 రోజులు) పేర్కొనాలి. ఆ గడువులోగా పూర్తి డబ్బు చెల్లించకపోతే ఒప్పందం ఆటోమేటిక్‌గా రద్దవుతుందని, బయానా సొమ్ము వెనక్కి ఇవ్వబోమని నిబంధనలు స్పష్టంగా రాయించుకోవాలి. ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు లాయర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం. మీరు ఆ నగరంలో ఉండటం లేదనే బలహీనతను మధ్యవర్తులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.









