ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదలైన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ నేటి ఫిల్మ్ మేకర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల పేరుతో వస్తున్న చిత్రాలలో హీరోలను బలవంతంగా ఎలివేట్ చేసే ధోరణిని ఆయన విమర్శించారు. ‘ధురంధర్’లో హీరోను దేవుడిగా చూపించే స్లో మోషన్ షాట్లు, చెవులు చిల్లులు పడే నేపథ్య సంగీతం లేవని, కథకు ప్రాధాన్యతనిస్తూ తీసిన ఈ చిత్రం భారతీయ సినిమాలో ఒక గొప్ప మార్పు అని ఆయన కొనియాడారు.
ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో దక్షిణాది యాక్షన్ దర్శకులకు వర్మ చురకలంటించారు. యాక్షన్ అంటే కేవలం చప్పట్లు కొట్టించే ఫైట్లు మాత్రమే కాదని, అవి పాత్రల మానసిక స్థితిని ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. ‘ధురంధర్’ యాక్షన్ డైరెక్టర్ ఏజాజ్ గులాబ్ పనితీరును అద్భుతమని మెచ్చుకుంటూ, మన సౌత్ ఇండియా యాక్షన్ మాస్టర్లు ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందులో హింసను కేవలం వినోదంగా కాకుండా, చూసే ప్రేక్షకుడికి ఒక మానసిక అనుభూతిని కలిగించేలా చిత్రీకరించారని తెలిపారు.
ఈ సినిమాలో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తనతో పాటు మరో నటుడు అక్షయ్ ఖన్నాకు ప్రాధాన్యత ఉండటాన్ని అంగీకరించడం ఆయనకు సినిమాపై ఉన్న అవగాహనకు నిదర్శనమని వర్మ ప్రశంసించారు. సౌండ్ డిజైన్‌ను ఒక ప్రధాన పాత్రగా మార్చడం, ప్రేక్షకుల తెలివితేటలను గౌరవిస్తూ కథను నడపడం వంటి అంశాలు దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘ధురంధర్’ కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదని, మూస ధోరణిలో సినిమాలు తీస్తున్న పరిశ్రమకు ఇదొక హెచ్చరిక అని వర్మ స్పష్టం చేశారు.









