ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్‌కు చంద్రబాబు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతం కావాలని, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. నితిన్ నబీన్‌ను యువతరం నాయకుడిగా అభివర్ణించారు. ఉత్సాహవంతుడైన నాయకుడికి జాతీయ అధ్యక్ష పదవి దక్కడం శుభసూచకమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, మోదీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఇదే ఐక్యతతో పనిచేస్తాయని స్పష్టం చేశారు.
అంతకుముందు చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసి నెల్లూరులో బిపిసిఎల్ (BPCL) రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపనకు ఆహ్వానించారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధిపై చర్చించారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన సాగుతోంది.









