తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరోసారి భారీ మోసం వెలుగులోకి వచ్చింది. భక్తులకు, దాతలకు అందించే పట్టు శాలువాల పేరుతో, ఒక కాంట్రాక్టర్ సంస్థ ఏకంగా 100 శాతం పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ మోసం 2015 నుంచి 2025 వరకు 11 ఏళ్లపాటు కొనసాగిందని, దాదాపు రూ.54.95 కోట్ల విలువైన శాలువాలను ఇలా కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. సెంట్రల్ సిల్క్ బోర్డు నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో ఈ శాలువాలు పాలిస్టర్ అని నిర్ధారణ అయింది.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టగా ఈ మోసం బయటపడింది. టెండర్ నిబంధనల ప్రకారం, శాలువాలు 100 శాతం మల్బరీ సిల్క్‌తో తయారై ఉండాలి మరియు సిల్క్ మార్క్ హోలోగ్రామ్ లేబుల్ తప్పనిసరిగా ఉండాలి. అయితే, విజిలెన్స్ టీమ్ తిరుపతి గోడౌన్, తిరుమలలోని వైభవోత్సవ మండపం నుంచి సేకరించిన నమూనాలను బెంగళూరు, ధర్మావరం సెంట్రల్ సిల్క్ బోర్డు ల్యాబ్‌లకు పంపగా, రెండు ల్యాబ్‌లు కూడా పాలిస్టర్‌గా నిర్ధారించాయి. అలాగే, తప్పనిసరి అయిన సిల్క్ హోలోగ్రామ్ లేబుల్ కూడా లేదని తేలింది.
వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్ మరియు దాని అనుబంధ కంపెనీలు 2015-2025 మధ్య టీటీడీకి ఈ దుస్తులను సరఫరా చేశాయి. ఈ మోసం వల్ల టీటీడీకి కోట్లాది నష్టం వాటిల్లిందని విజిలెన్స్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో విజిలెన్స్ రిపోర్ట్‌ను పరిశీలించిన తర్వాత, సరఫరాదారు మోసం చేశాడని నిర్ధారించారు. దీంతో, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ యాంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌కు వివరణాత్మక విచారణకు లేఖ రాయాలని, అందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఇప్పటికే ఉన్న టెండర్లను రద్దు చేసి, కొత్త టెండర్లు జారీ చేయనున్నారు.









