UPDATES  

NEWS

 గుడివాడ రాజకీయాల్లోకి కొడాలి నాని రీఎంట్రీ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం

మాజీ మంత్రి కొడాలి నాని సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడ రాజకీయాల్లోకి మళ్లీ చురుకుగా ఎంట్రీ ఇచ్చారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో కోర్టు వాయిదాలు లేదా ముందస్తు బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లలో సంతకాలు పెట్టడానికి మాత్రమే వచ్చి వెళ్లేవారు. అయితే ఈసారి ఆయన పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు, మళ్లీ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని ప్రకటించారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు పునాదులు వేశారని, అందులో ఐదు పూర్తయ్యాయని, మరో ఐదు తుది దశకు చేరుకున్నాయని కొడాలి నాని తెలిపారు. పేద విద్యార్థులు, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కుట్రను అడ్డుకోవాలంటే జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారని కొడాలి వివరించారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని ప్రకటించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కొడాలి నాని గతంలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి ముంబైలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. దీంతో ఆయన కోలుకోవడానికి సమయం పట్టింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో విపరీతమైన భాషను ఉపయోగించినందున, ప్రభుత్వం మారగానే కొడాలి నానిపై చర్యలు ఉంటాయని ‘రెడ్ బుక్’ లో ఆయన పేరే మొదటి పేరుగా ఉంటుందని టీడీపీ వర్గాలు పదేపదే ప్రస్తావించేవి. ఇప్పుడు ఆయన పూర్తిగా ఆరోగ్యంగా రాజకీయాల్లోకి రావడంతో, టీడీపీ క్యాడర్ కూడా ఈ రెడ్ బుక్ మళ్లీ రెడీ అవుతుందని నమ్ముతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |