ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై ప్రముఖ సినీ నటి జయసుధ ప్రశంసలు కురిపించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంలో నటన ఉండదని అన్నారు. ఆయన వైఖరి ఎప్పుడూ ఆయనదేనని, గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని, ఆయనలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.
పవన్ కల్యాణ్ సినిమాల్లో ఎవరికీ తలవంచలేదని, ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎవరికీ తలొగ్గడం లేదని జయసుధ అన్నారు. పవన్ కల్యాణ్‌కు ఒక ప్రత్యేక శైలి, ఒక మార్గం ఉందని, దాని ప్రకారమే ముందుకు సాగుతారని తెలిపారు. లేదంటే ఆయన ఎప్పుడో మధ్యలోనే రాజీనామా చేసి వెళ్ళిపోయేవారని అభిప్రాయపడ్డారు. ఆయన పడిన కష్టం, ఆయన నిజాయితీ గల వ్యక్తిత్వం ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని కొనియాడారు.
రాజకీయాల్లో ఇన్ని ఒత్తిడులు ఎందుకని ఆయన అనుకుంటే మధ్యలోనే వదిలి వెళ్లేవారని జయసుధ అన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని, ఆయనకు ఎంతైనా ఇవ్వడానికి సినీ పరిశ్రమ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆయన ఆ డబ్బును, సినీ అవకాశాలను వదులుకుని, ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నారని జయసుధ వ్యాఖ్యానించారు.









