కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీశ్ రావుపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేడ్చల్ జిల్లాలో 32 లక్షల మంది జనాభా ఉన్నప్పటికీ, ‘ఆరడగుల బుల్లెట్’ కనీసం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కూడా కట్టించలేదని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో మీడియాతో మాట్లాడిన కవిత, లక్ష్మాపూర్‌ను గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సందర్శించినా, వారి సమస్యలు మాత్రం తీరలేదని పేర్కొన్నారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లి నియోజకవర్గాలలో “బీటీ బ్యాచ్” గెలిచిందని ఆమె విమర్శించారు.
ఈ “బీటీ బ్యాచ్” లో ఉన్న వారందరూ చెరువులు, కబ్జాలు, అధికారం కోసమే బీఆర్‌ఎస్‌లోకి వచ్చారని కవిత ఆరోపించారు. కుత్బుల్లాపూర్‌ను ప్రజలు “కబ్జాల పూర్” అని పిలుస్తున్నారని, కబ్జాలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్తేనే వారి సమస్యలు తెలుస్తాయని సూచించారు. మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా, డిఫాక్టో సీఎం కేటీఆర్ మొత్తం అభివృద్ధి చేశానని చెప్పుకున్నారని, కానీ మేడ్చల్‌కు వెళ్లి చూస్తే అక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కవిత మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పర్యటన సాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ఆమె మాజీ మంత్రుల పనితీరుపై, ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో వైద్య సదుపాయాల కొరతపై కేంద్రీకరిస్తూ, హరీశ్ రావుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, ముఖ్యమైన మౌలిక వసతులను కల్పించడంలోనూ మాజీ పాలకులు విఫలమయ్యారని ఆమె పరోక్షంగా అభిప్రాయపడ్డారు.









