పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 100 శాతం ఫలితాలను సాధించే లక్ష్యంతో, 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా, విద్యార్థులకు సెలవు రోజుల్లో, ఆదివారాలు సహా ప్రతిరోజూ మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ఈ మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం వడ్డించాల్సి ఉంటుంది.
డిసెంబర్ 6వ తేదీ నుండి ఈ ప్రత్యేక స్టడీ ప్లాన్ పాఠశాలల్లో అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా, విద్యార్థులకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో అయితే, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు నాలుగు గంటల పాటు రెండు సబ్జెక్టులపై ప్రత్యేక స్టడీ క్లాసులు ఉంటాయి. ఈ తరగతులు ముగిసిన వెంటనే ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి, వారిని ఇళ్లకు పంపుతారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం కారణంగా పలు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో ఇది దాదాపు 100 శాతానికి చేరుకోగా, మిగతా చోట్ల హాజరు పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, పాఠశాలలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, ముఖ్యంగా ఆహారం యొక్క నాణ్యత, మరియు పరిమాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.









