ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, గత ఎన్నికల్లో ఐ-ప్యాక్ (I-PAC) సర్వేలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల కొంత నష్టం జరిగిందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల వ్యూహాల కోసం కేవలం సర్వేలు, ఐ-ప్యాక్‌పైనే ఆధారపడకుండా, నియోజకవర్గ స్థాయిలోని ముఖ్య కార్యకర్తల ఫీడ్‌బ్యాక్పై ఎక్కువ ఆధారపడే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
పార్టీ కష్టకాలంలో మౌనంగా ఉంటూ, కేవలం అధికారం ఉన్నప్పుడే పెత్తనం చెలాయించే ‘కోవర్టు’ నేతలపై దృష్టి సారించాలని వైసీపీ క్యాడర్ బలంగా కోరుతోంది. హోదాలు, పదవులు తీసుకుని సైలెంట్‌గా ఉన్నవారిని గుర్తించి, వారిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే, ఎటువంటి హోదా లేకున్నా పార్టీ కోసం నిజాయితీగా శ్రమించే వారికి మంచి స్థానం కల్పించాలని జగన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలలో పరిస్థితి, పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు చేయడం లేదన్న వివరాల డేటా ప్రతిరోజూ కేంద్ర కార్యాలయానికి చేరుతోంది. ఈ నిఘా వ్యవస్థ ఐ-ప్యాక్ కాకుండా, ప్రధానంగా ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్పైనే ఆధారపడి పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన కార్యకర్తల అభిప్రాయాలలో నిజముందని భావించిన జగన్, వారి అభిప్రాయాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.









